అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గోదావరి నిండు కుండలా ప్రవహిస్తున్నది. ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. అత్యవసర సహాయ చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.
ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. డ్యాములు నిండిపోవడంతో గెట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉన్నది. దాంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సిద్ధమైంది. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రంలోని వివిధ నదుల్లో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చర్యలు చేపట్టంది. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యలకు రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యలు చేపడుతున్న వారికి ప్రజలు సహకరించాలని సూచించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నది. కాగా, ప్రకాశం బరాజ్‌కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరిగింది. దాంతో గేట్లు ఎత్తి దిగువకు వరద నీరు విడుదల చేస్తున్నారు. దిగువకు నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించొద్దని సూచిస్తున్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం వంటి పనులు చేయడం మంచిది కాదన్నారు.