YSRCP MLA Anna Rambabu | గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు రాజకీయాలకు తన అనారోగ్యం సహకరించడం లేదన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
జిల్లాలో ఒక ముఖ్య సామాజిక వర్గం తనను టార్గెట్ చేసుకుని, ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు. జిల్లా పార్టీ నేతలకు చెప్పినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. ‘ ఇటీవల నేను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. నాపై జరుగుతున్న దుష్ప్రచారంపై జిల్లాలోని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లా. నన్ను వ్యక్తిగతంగా నా కులాన్ని దూషించారు. జిల్లా పార్టీ పెద్దల నుంచి నాకు సరైన మద్దతు లభించకపోవడం నా దురదృష్టం. సొంత పార్టీ వాళ్లే కించపరిచినా ఎవరూ ఓదార్చలేదు. ముఖ్యమంత్రికి నేను పోటీ చేయనని చెప్పాను. సీఎం నన్ను గట్టిగా ఉండాలని చెప్పడం వల్లే పోటీ చేస్తానని ప్రకటించాను. డబ్బులు తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తిని కాను. ఏదేమైనా 2024లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరులో వైసీపీనే గెలుస్తుంది. వైసీపీ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తాను ‘ అని తేల్చి చెప్పారు.
34 ఏండ్లుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుటుంబం రాజకీయాల్లో ఉన్నా ప్రకాశం జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట కుటుంబాన్ని ఆదరించొద్దంటూ పిలుపునిచ్చారు. మాగుంట ఓటమి కోసం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తానంటూ రాంబాబు సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
గిద్దలూరు నియోజకవర్గంలో అన్నా రాంబాబు 2009లో ప్రజారాజ్యం తరఫున తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్లో వీలినమైంది. ఆ తర్వాత 2014లో టీడీపీలో చేరారు. 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి 81వేల భారీ మెజారిటీతో గెలుపొందారు.