విజయనగరం జిల్లా : కర్నూలు మున్సిపల్ అధికారులు ఇంటి ముందు చెత్త వేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇది మరవక ముందే విజయనగరం మున్సిపల్ అధికారులు చెత్త పన్ను పేరుతో పరమ చెత్త విధానాన్ని అనుసరించి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. వీరి నిర్వాకం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు మున్సిపల్ అధికారులపై చిర్రెత్తుతున్నారు.
నగరంలోని పూల్‌బాగ్ కాలనీలోని సాయి అమృత అపార్ట్మెంట్లో నివసించే వారు చెత్త పన్ను కట్టలేదని స్థానిక మున్సిపల్ సిబ్బంది గేటు ముందు చెత్త వేశారు. అడ్డుకున్న ఇంటి యజమానిపై దాడి చేస్తుండగా మరొకరు వీడియో తీశారు. ఆగ్రహంతో ఆ వ్యక్తి చేతుల్లో నుంచి ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. అపార్ట్మెంట్ వద్ద నిరసన తెలిపిన వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెత్త కట్టకపోతే ఇలాంటిదే అనుభవించాల్సి ఉంటుందని వారు ఘంటాపథంగా చెప్తుండటంతో విస్తుపోవడం ప్రజల వంతైంది.
చెత్త పన్ను కట్టాలంటూ ప్రజలపై మున్సిపల్ అధికారులు ఒత్తిడి చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. చెత్తను అపార్ట్మెంట్ ముందు వేయడం, మొబైల్ ఫోన్ లాక్కొని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఇలాంటి చెత్త ఆదేశాలను జారీ చేసిన అధికారులపై ముందుగా కఠిన చర్యలు తీసుకోవాలని, చెత్త పన్నును వెంటనే రద్దు చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.