మూడేండ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా? అని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తెలుసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పాటించలేదని అన్నారు. ఈ ఘటనతో జగన్ ఎంత పిరికివాడో అర్థం అవుతుందని సెటైర్ వేశారు.
2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాసరావు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021 ఫిబ్రవరి 6వ తేదీన రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇవ్వలేదని అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో అదే ఏడాది ఫిబ్రవరి 12 మరోసారి తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఇంతకాలంగా పెండింగ్‌లో ఉన్న గంటా రాజీనామాను.. తాజాగా స్పీకర్ ఆమోదించారు. గంటా శ్రీనివాసరావు ఆమోదంపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, రాపాక వరప్రసాద్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ తమ్మినేని నోటీసులు జారీ చేశారు.