వినాయక చవితి వచ్చిందంటే చాలు చిన్నాపెద్దా అందరిలోనూ ఉత్సాహం వస్తుంది. విభిన్న రూపాల్లో గణనాథులు కొలువుదీరుతాయి. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, పువ్వులు, వస్తువులు.. ఇలా విభిన్న రకాలుగా ఏకదంతుడు దర్శనమిస్తుంటాడు. మండపాలను కూడా నూటొక్క తీరుగా అలంకరించి భక్తిని చాటుకుంటారు. అయితే, ఇది ఆషామాషీ వినాయక మండపం కాదు సుమా! లక్షల కరెన్సీతో మండపాన్ని తయారుచేసి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
గుంటూరు వాసవి యువజన సంఘం కార్యవర్గం గత కొన్నేండ్లుగా తమ భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నది. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక మండపాన్ని కరెన్సీ నోట్లతో రూపొందించారు. మొత్తం రూ.1.60 కోట్ల నోట్లతో మండపాన్ని అందంగా అలంకరించారు. రూపాయి నాణెం నుంచి 2 వేల రూపాయల నోట్ల వరకు.. అలంకరణలో వినియోగించారు. వినాయకుడి కిరీటం, దండలు, విగ్రహం వెనుక అలకంరణలు, మండపంలో తోరణాలు.. ఇలా అన్నీ కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దారు. భారతదేశం మ్యాప్‌తో పాటు పొట్టిశ్రీరాములు, గాంధీ చిత్రాలను ముగ్గు వేశారు. వీటిని కూడా నాణేలతో అలంకరించారు.
ఏటా వినూత్నంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదని వాసవి యువజన సంఘం నిర్వాహకులు తెలిపారు. స్థానిక వ్యాపారుల సహకారంతో వినూత్నంగా తయారుచేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కరెన్సీతో అలంకరించటం సంప్రదాయంగా వస్తుండటం విశేషం. కరెన్సీ కట్టలతో అలంకరించిన ఈ వినాయక మండపాన్ని చూసేందుకు గుంటూరు నగరంతోపాటు పరిసర గ్రామాల ప్రజలు విశేష సంఖ్యలో వస్తున్నారు. వినాయక మండపానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు బందోబస్తు ఏర్పాటుచేశారు.