Srisailam | మానవ సేవే మాధవ సేవగా భావించి శ్రీశైల మహా క్షేత్రంలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు శ్రీకృష్ణ యాదవ నిత్యాన్న సత్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఆదివారం సత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా వైద్యశిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చిన దేవస్థాన కార్య నిర్వహణాధికారి చంద్ర శేఖర్ ఆజాద్ మాట్లాడుతూ క్షేత్రంలో నివసించే వారితోపాటు పరిసరప్రాంతాల్లో ఉండే గిరిజన చెంచు ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందించడం హర్షనీయమని నిర్వాహకులను అభినందించారు. శిబిరంలో వివిధప్రాంతాల నుండి వచ్చిన వైద్యనిపుణులు కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, డెంటల్, పిడియాట్రీషన్, ఈఎన్టీ, డెర్మటాలజిస్టులతోపాటు పలువురు టెక్నీషియన్లతో ఈవో స్వయంగా మాట్లాడి క్షేత్ర పరిధిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకున్నారు. ఈ విధమైన శిబిరాల నిర్వహించేందుకు దేవస్థానం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు.
ఉచిత వైద్య శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ క్షేత్ర పరిధిలోని నిరుపేదలకు అరకొర వైద్యం అందుతుండటంవల్ల అనేక రోగాల బారీన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం స్వయంగా చూసి చలించిన తన మిత్రులైన వైద్యులను సంప్రదించడంతో ఉచితంగా వైద్యపరీక్షలతోపాటు మందుల పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ఈ శిబిరాన్ని రెండు మాసాలకు ఒకసారి నిర్వహిస్తూ వైద్య నిపుణులతో గిరిజన నివాస ప్రాంతాలకు వెళ్లి సేవలందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. దేవస్థానం అధికారులు సిబ్బందితోపాటు స్థానిక ప్రజలు, యాత్రికులు సుమారు 400 మందికి పైగా వైద్యులను సంప్రదించినట్లు చెప్పారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో పుట్టుకతో మూగ, చెవిటి చిన్నారులకు శాశ్వత పరిష్కారానికి కావలసిన వైద్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్య నిపుణులు రామకృష్ణ దంపతులు, సీతారామిరెడ్డి, ఊర్మిళా యాదవ్, సంజీవ్ దంపతులు, దస్తగిరి, సాయికృష్ణ, కిరణ్, బసవయ్య, హరిబాబులతోపాటు యాదవ సంఘం నిర్వాహకులు బాబు, వెంకటేశ్వర్లు, చెంచయ్య, నాగేశ్వర్రావు, ఆళూరి, నాగార్జునప్రసాద్, మేనేజర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.