తిరుపతి: స్విమ్స్‌లో చదువుతున్న ఫిజియోథెరపీ, నర్సింగ్, పారా మెడికల్ విద్యార్థులకు టీటీడీ విద్యాసంస్థల్లో మాదిరిగానేఉచిత భోజన సదుపాయం కల్పించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ విషయాన్ని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి సోమవారం వెల్లడించారు. జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తో కలసి ఆయన స్విమ్స్‌లోని పలు విభాగాల క్యాంటీన్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్విమ్స్‌లోని రోగులు, వారి సహాయకులు, డాక్టర్లు, ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా క్యాంటీన్ సౌకర్యం పెంచేందుకు, బాయ్స్ హాస్టల్లో ఆర్ఓ ప్లాంట్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దవాఖాన వద్ద రోగులు వేచి ఉండే షెల్టర్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. యూజీ, పీజీ విద్యార్థులు తమ హాస్టల్‌ను తామే నిర్వహించుకునేలా కొత్త ప్రతిపాదనలతో రావాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
స్విమ్స్ బయట ఉన్న క్యాంటీన్, ఆఫీసర్స్ క్యాంటీన్, జనరల్ వార్డ్ డైనింగ్ హాల్, బాలురు, బాలికల హాస్టల్, పీజీ హాస్టల్, పద్మావతి హాస్పిటల్ క్యాంటీన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ధర్మారెడ్డి వెంట ఎఫ్ఏసీఏఓ బాలాజి , చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, శ్రీ పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శరన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తదితరులు ఉన్నారు.