అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024) పరీక్షకు హాజరయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ (Free coaching) ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన మైనారిటీ అభ్యర్థులు (Minority candidates) జులై 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టెట్ (TET) పరీక్ష నిర్వహిణకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి, జులై 4 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభించింది.
ఉచిత శిక్షణ కోరే అభ్యర్థులు ఇంటర్, డీఎడ్, డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణత కలిగి ఉండటంతో ఏపీ టెట్ – జులై 2024కు దరఖాస్తు చేసుకుని ఉండాలని మైనారిటీ శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మైనారిటీలు అంటే ముస్లింలు(Muslims) , సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులని వెల్లడించింది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. విజయవాడ , కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలోని సంబంధిత ప్రాంతీయ కేంద్రాలలో ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చని సంబంధిత అధికారులు వెల్లడించారు.