Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. దసరా, దీపావళి అంటూ ప్రతి పండక్కి వాయిదాలు వేసుకుంటూ వస్తూనే ఉన్నారు. సంక్రాంతికి పక్కాగా ఉచిత బస్సు ప్రయాణిమిస్తామని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అది కాస్త ఉగాదికి వాయిదా పడింది. ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా ప్రకటించారు.
ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం నాడు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి నుంచే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయడానికి గల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అయితే జీరో టికెటింగ్ విధానం, ఇతర ఏర్పాట్లకు కొంత సమయం పడుతుందని అధికారులు చెప్పారు. సంక్రాంతిలోపు వాటన్నింటినీ పూర్తి చేయడం కష్టమని వివరించారు. దీంతో ఉగాదిలోపు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎటువంటి విధానాలను అనుసరిస్తున్నారు.. వారికి ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై ఒక నివేదికను రూపొందించాలని ఆదేశించారు.