YCP MLAs Suspension | ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. అధికార వైసీపీకి చెందిన నాలుగు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందేందుకు అవసరమైన మెజారిటీ లేకున్నా 23 ఓట్లతో విజయం సాధించారు. దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలిపోయింది. తాజాగా శుక్రవారం నలుగురు పార్టీ ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ఎమ్మెల్యేలుగా వేటు పడిన వారిలో ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఉన్నారు. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవలి కాలంలో వైసీపీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఉండవల్లి శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని పేర్కొన్నారు. తాను గురువారం ఉదయమే సీఎం వైఎస్ జగన్‌ను కలిశానని చెప్పుకున్నారు. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు సమాచారం. అన్ని విధాల సమాచారం సేకరించిన తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసిందని తెలుస్తున్నది.