విశాఖపట్నం: భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర వణికిపోతున్నది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంద్ర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద క్రమంగా పెరుగుతున్నది. దీంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. ఏలూరు, కైకలూరు, గుడివాడ, మొండికోడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తమ్మిలేరుకు వరద ఉధృతి కొనసాగుతుండటంతో ఏలూరు-శనివారంపేట కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో కొల్లేరు, తమ్మిలేరు పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో ఉన్న జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గిరిజనుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన నలుగురిని గ్రామస్తులు కాపాడారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలో బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కాగా, సీలేరు ఘాట్ రోడ్డులోనూ కొండచరియలు విరిగిపడ్డారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాను కలిపే నర్సీపట్నం-భద్రాచలం అంతర్రాష్ట రహదారిలో దాదాపు 16 కిలోమీటర్ల మేర పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. హైవేపై బురద, రాళ్లు పేరుకుపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.