అమరావతి : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు (Nandigam Suresh) సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది . వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో అరెస్టయిన సురేష్ మధ్యంతర బెయిల్ ( Interim bail) కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అతడికి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను జవవరి 7వ తేదీకి వాయిదా వేసింది.
2020లో కేసు నమోదైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారని సురేష్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కేసు విచారణ ఎందుకు చేపట్టలేదని ధర్మాసనం ప్రశ్నించింది. అప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, విచారించి ఉండాల్సింది . అప్పుడు విచారించి ఉంటే నిర్దోషిత్వం బయటపడేది కదా అంటూ ఎదురు ప్రశ్నించింది. గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ కేసులపై సమీక్షించ లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు.
సురేష్ నేరచరిత్ర, మరియమ్మ హత్య కేసు వివరాలు కోర్టు ముందుంచారు. కేసుల వివరాలు చెప్పకుండా సురేష్ కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని సిద్ధార్థలూథ్రా ఆరోపించగా గతంలో నమోదైన కేసుల వివరాలు చెప్పకపోవడంపై సురేష్ లాయర్లపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మరిన్ని వివరాలిచ్చేందుకు కొంత సమయ ఇవ్వాలని సురేష్ తరఫు న్యాయవాదులు కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ మంజూరు చేయలేమని స్పష్టం చేశారు.