అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ కార్యకర్తలపై పెడుతున్న కేసులపై వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని (Perninani ) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసుల చేత పాత కేసులను (Cases) తిరగదోడించి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
వైసీపీకి (YCP) చెందిన అమాయకులపై కేసులు బనాయించడం దారుణమని అన్నారు.చంద్రబాబు ఎల్లకాలం సీఎంగా ఉండరన్న విషయాన్ని అధికారులు , పోలీసులు గ్రహించాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు (Law and Order ) కరువయ్యాయని పేర్కొన్నారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ ఏదో ఒక సంచలన ఆరోపణలు చేస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. రెడ్‌బుక్ పేరిట భయాందోళనలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.