Venkaiah Naidu | ప్రస్తుత రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలో ఉండే నాయకులు హుందాగా వ్యవహరించాలని అన్నారు. కానీ కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలు ఓట్లు వేయకుండా తగిన బుద్ధి చెబుతున్నారని అన్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడులో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు హాజరై.. కీలక సూచనలు చేశారు. రాజకీయాల్లో తాను ఒక్కటే మార్గం.. ఒక్కటే పార్టీలో ముందుకు సాగానని స్పష్టం చేశారు.
రాజకీయ నాయకులకు సానుకూల దృక్పథం ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ నాయకుడు ఎప్పుడూ ప్రజల కష్టనష్టాలు తెలుసుకుని సానుకూలంగా స్పందించాలని సూచించారు. ప్రజా నాయకుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని.. అప్పుడే మన వద్దకు వచ్చే కార్యకర్తలు, ప్రజలు సమస్యలను చెప్పుకోగలరని పేర్కొన్నారు. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా చట్టసభల్లో హుందాగా నడుచుకోవాల్సిందిపోయి గుండీలు చింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బయటకు రా.. నీ సంగతి తేలుస్తా.. అంటూ వాళ్ల వ్యక్తిత్వాన్ని చూపుతున్నారని వెంకయ్య నాయుడు తెలిపారు. కానీ ప్రజాప్రతినిధులుగా ఉండాల్సిన వారు హుందాగా ఉండాలని.. మాటలు సక్రమంగా రావాలని సూచించారు. కష్టపడి ఇష్టంగా పనిచేసే వ్యక్తులే రాజకీయాల్లోకి రావాలని సలహానిచ్చారు. కానీ కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతూ తమ హుందాతనాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలు ఓట్లు వేయకుండా ప్రతిపక్షాల్లో కూర్చోబెడుతున్నారని వ్యాఖ్యానించారు.
త ప్రభుత్వంలో ఏపీ అసెంబ్లీలో బూతులు మాట్లాడారు. అలాంటి వారికి బూత్‌లో ఓట్లు వేయకుండా ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాగా వ్యవహరించాలి. రాజకీయాల్లో నేను ఒక్కటే మార్గం.. ఒక్కటే పార్టీలో ముందుకు సాగాను. పిల్లలందరూ అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలతో గడిపే విధంగా తల్లిదండ్రులు పోత్సహించాలి. అలా చేస్తేనే వారికి మన సంప్రదాయాలు, విలువలు తెలుస్తాయి. నా చిన్నతనంలోనే మా అమ్మ గేదె పొడిచి చనిపోయారు. అమ్మమ్మ, తాతయ్యల వద్దే లోకజ్ఞానం నేర్చుకున్నా. తాతతో కలిసి పొలం పనులకు వెళ్లేవాడిని. వ్యవసాయం మన సంస్కృతి, సంప్రదాయం అని తెలిసేలా పిల్లలను తీర్చిదిద్దాలి” అని అన్నారు.