అమరావతి : రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం (Adulterated liquor ) అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వైసీపీ నాయకులు, మాజీ మంత్రి పేర్నినాని ( Perninani ) ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లాలో జరిగిన నిరసనలో పేర్నినాని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా పెరిగిపోయాయని దీంతో మద్యం తాగి సామాన్యులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అమ్మకాలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర( Minister Kollu Ravindra) అబద్దాలు చెబుతున్నాడని ఆరోపిస్తూ కొల్లు అని కాకుండా సొల్లు రవీంద్ర అని పేరు పెట్టుకోవాలని సెటైర్లు (Satirical Comments ) వేశారు. రాష్ట్రంలో మంచి నీటికైనా కరువు వచ్చిందేమో కాని మద్యానికి మాత్రం కరువు రాలేదని తెలిపారు. కల్తీ మందును అందిస్తున్న మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ కార్యకర్తలు తిరగబడి తన్నే రోజులు వస్తాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నారావారి పాలన నశించాలంటూ నినాదాలు చేశారు. నకలీ మద్యం నియంత్రించాలని, కల్తీ, నకిలీ మద్యంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.