అమరావతి : భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) వైసీపీలో చేరారు. తాడేపల్లి నివాసంలో ఏపీ సీఎం జగన్(CM Jagan) సమక్షంలో వైసీపీ(YCP ) కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా అంబటిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రయంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు జీవితంలో క్రికెట్ ప్రాధాన్యత ఉండగా ఇకపై రాజకీయాల్లో చురుకుగా ఉంటూ రెండో ఇన్నింగ్స్ (Second Innings) ప్రారంభిస్తానని వెల్లడించారు. తనకు మొదటి నుంచి వైఎస్ జగన్ అభిమానినని వివరించారు. ఏపీలో పారదర్శకంగా పాలనను అందిస్తున్న జగన్‌కు వెన్నంటూ ఉంటానని స్పష్టం చేశారు.
ప్రజా సేవ చేసేందుకు తాను రాజకీయంలోకి అడుగు పెట్టినానని, తనకు అవకాశమిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంబటి రాయుడు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే గుంటూరు పార్లమెంటు పరిధిలో రాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు.