Jogi Ramesh | అగ్రి గోల్డ్ భూమి కబ్జా వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జోగి రమేశ్‌కు తాను స్థలం అమ్మలేదని పోలవరం మురళీమోహన్ సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో పోలవరం మురళీ మోహన్ కూడా ఉన్నాడు. దీంతో ఆయన్ను తాజాగా సీఐడీ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఫ్యామిలీకి తాను ఎలాంటి భూమి విక్రయించలేదని సీఐడీ విచారణలో మురళీమోహన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో తన పేరుతో వచ్చిన డాక్యుమెంట్స్ గానీ, ఆధార్ కార్డుగానీ తనది కాదని సీఐడీకి వివరించారు. దీంతో జోగి రమేశ్ ఫ్యామిలీపై ఫోర్జరీ కేసును సీఐడీ అధికారులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం సంచలనంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంట్లో ఇటీవల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. సీఐడీ జప్తులో ఉన్న అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి అమ్మినట్లు గుర్తించారు. దీంతో జోగి రమేశ్ కొడుకు రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1గా జోగి రమేశ్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు, ఏ2గా జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, ఏ3గా అడుసుమిల్లి మోహన్ రామ్‌దాస్, ఏ4గా అడుసుమిల్లి వెంకట సీతామహాలక్ష్మి, ఏ 5గా గ్రామ సచివాలయ సర్వేయర్ దేదీప్య, ఏ6గా మండల సర్వేయర్ రమేశ్, ఏ7గా డిప్యూటీ తహశీల్దార్ విజయ్‌కుమార్, ఏ8గా మండల తహశీల్దార్ పేర్లను కేసులో చేర్చారు.