Chirala Beach | బాపట్ల జిల్లా చీరాలలో విషాదం నెలకొంది. వాడరేవు తీరంలో సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.
వివరాల్లోకి వెళ్లే ఆదివారం వీకెండ్ కావడంతో అమరావతిలోని విట్ యూనివర్సిటీ నుంచి 10 మంది విద్యార్థులు వాడరేవుకు వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా అలల తాకిడికి ఎనిమిది మంది సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ముగ్గురిని రక్షించారు. కానీ మిగిలిన వారిని వారు కాపాడలేకపోయారు. గల్లంతైన కాసేపటికే ఐదుగురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలను చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మరో ఇద్దరి కోసం అగ్నిమాపక, మత్స్య శాఖ అధికారులు డ్రాగన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ప్రాణాలకు తెగించి నలుగురు యువకులను రక్షించారు. కపిలేశ్వరానికి చెందిన అబ్దుల్ ఆసిఫ్, ఎస్కే ఆర్ఫాద్, ఎస్కే సికిందర్, షరీఫ్ ఆదివారం ఉదయం మంగినపూడి బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి వారు కొట్టుకుపోయారు. ఇది గమనించిన కానిస్టేబుళ్లు నాంచారయ్య, శేఖర్ హుటాహుటిన నీటిలోకి వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు.