కాకినాడ జిల్లా : స్థానిక చక్కెర కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ఎనిమిది మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. సంఘటనాస్థలాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సందర్శించి.. మృతుల కుటుంబాలను పరామర్శించారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కాకినాడ చక్కెర కర్మాగారానికి చెందిన గోదాంలో చక్కెర బస్తాలను లోడ్ చేస్తుండగా కన్వేయర్ బెల్ట్‌కు విద్యుత్ సరఫరా జరిగి మంటలు చెలరేగాయి. దాంతో చక్కెర బస్తాలకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కూలీలు అగ్నికీలలకు బాధితులుగా మారారు. కాగా, వీరవెంకట సత్యనారాయణ, వీరమళ్ల రాజేశ్వర్‌రావు అనే కార్మికులు తీవ్రంగా గాయపడి చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. మరో ఎనిమిది మంది కూలీలు కూడా గాయపడ్డారు. వీరిలో బండి వీరవెంకట రమణ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు కాకినాడలోని వివిధ హాస్పిటళ్లలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. చక్కెర కర్మాగారం యాజమాన్యానికి వ్యతిరేకండా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించారు. దీంతో కాస్సేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు పోలీసులు హామీ ఇవ్వడంతో.. కార్మికులు, యూనియన్ నాయకులు ఆందోళన విరమించారు. ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు, ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పరిశీలించి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబాలకు ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తామని కన్నబాబు హామీ ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.