అమరావతి : కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Union Minister Shivaraj Singh) రెండో రోజు శుక్రవారం కృష్ణా జిల్లా కేసరపల్లిలో పర్యటించారు. బుడమేరు (Budameru) గండ్ల వల్ల పంట నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ రైతులకు (Farmers) అండగా ఉంటాం. ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆదేశాలతో వరద విపత్తును పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు, రైతులతో మాట్లాడటానికే ఇక్కడికి వచ్చాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా, రైతు పక్షపాతిగా అన్నదాతల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందన్నారు. 8,9 రోజులుగా రైతుల పంట పొలాల్లో నీళ్లు నిలిచి ఉన్నాయి. వరి సహా పలు రకాల పంటలు పూర్తిగా నీట మునిగి రైతులు నష్టపోయారని తెలిపారు.
సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ ఈ విపత్తును సీరియస్‌గా తీసుకున్నారని, ఇద్దరూ కూడా రైతులకు అండగా నిలబడతారని, రైతులు ఆందోళన చెందవద్దని, ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. కేంద్ర మంత్రి వెంట మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి, అధికారులు ఉన్నారు. అనంతరం వారు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.