అమరావతి : దేశంలో ఎవరికి లేని విధంగా రైతులకే (Farmers) ఎక్కువ అప్పులున్నాయని, ఈ దుస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే చర్యలను చేపట్టనుందని ఏపీ సీఎం చంద్రబాబు (Chandra Babu) పేర్కొన్నారు. వ్యవసాయ సాగులో ఖర్చు తగ్గి ఆదాయం ఎక్కువ వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
పల్నాడు జిల్లా (Palnadu District) యల్లమందలో మంగళవారం చంద్రబాబు పర్యటించి పింఛన్లను (Pensions) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రజావేదిక పేదల సేవలో అనే కార్యక్రమంలో మాట్లాడారు. రాబోయే రోజుల్లో డ్రోన్ల ద్వారా వ్యవసాయంలో (Agriculture) పెనుమార్పులు వస్తాయని అన్నారు. కరువు రహిత రాష్ట్రంగా మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. తెలుగుతల్లికి జలహారతి ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
తొందరలోనే మెగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేసి వచ్చే విద్యాసంవత్సరంలోగా16,343 పోస్టింగులు, శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేసి భర్తీ చేయబోతున్నామని వివరించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్రం 15వేల కోట్లను రాజధాని అమరావతి అభివృద్ధి ఇచ్చిందని, మరికొన్ని సంస్థలు కూడా రుణాన్ని ఇస్తున్నాయని వెల్లడించారు.
ఐదేళ్లలో విధ్వంసం
నా జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంసం గత ఐదేళ్లలో చూశానని, వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేశారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ దారి మళ్లించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ రాలేదు. ఉన్నవి కూడా పారిపోయాయి. పరిశ్రమలు రాలేదు కాబట్టే గత ప్రభుత్వంలో ఆదాయం పెరగలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకోవాలని, ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడితే తాట తీస్తానని హెచ్చరించారు.