అమరావతి : ఏపీలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను పరిష్కరించకుండా కేవలం వైసీపీ (YCP) పార్టీకి చెందిన నాయకులపై దాడులు, అక్రమ కేసులు పెడుతూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి తప్పుడు వాంగ్ములం సృష్టించి వారిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగిన రోజున బద్వేలులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉన్నానని, దాడికేసులో తన ప్రమేయం లేదని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు స్వేచ్ఛగా తిరుగకుండా ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వైసీపీ నాయకులు ఏం చేసినా వైసీపీ నాయకులు బెదిరిపోరని, కళ్లు మూసుకుని, తెరుచుకునే లోగా ఎన్నికలు వస్తాయని గుర్తించుకోవాలని తెలిపారు. వైఎస్ జగన్ పాలనలో ఆధారాలు లేకుండా ఎవరిపై కేసులు నమోదు చేయలేదని వెల్లడించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచనలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని భావించడం ప్రజాస్వామ్యంలో సరియైనది కాదని అన్నారు.