తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవంగా కొలువబడుతున్న తిరుమల (Tirumala) వేంకటేశ్వర సన్నిధిలో జరుగుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం నకిలీ టికెట్లతో (Fake tickets ) వచ్చిన భక్తులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
హైదరాబాద్కు చెందిన నళినికాంత్ సహ మరో ఇద్దరు భక్తులు వైకుంఠం క్యూలైన్లో దర్శనానికి రాగా వారి టికెట్ స్కాన్ ( Scan ) కాకపోవడంతో సిబ్బంది వెనక్కి పంపారు. వారు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు. సతీష్ అనే దళారీ రూ. 10 లక్షల దాతల నకిలీ టికెట్లను ముగ్గురు భక్తులకు ఇచ్చి వారి వద్ద రూ. 2,100 వసూలు చేసి నకిలీ ఇచ్చినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచియుండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 51,349 మంది భక్తులు దర్శించుకోగా 14,082 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.65 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.