Inter Exams | హైదరాబాద్, జనవరి 8 (నమస్తేతెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ విద్య సంస్కరణలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రు లు, విద్యావేత్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ప్రజలెవరూ ఇలాంటి వదంతులు నమ్మొద్దని ఆమె సూచించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నట్టు వివరించారు. తెలుగు రాష్ర్టాల్లో మినహా మిగతా రాష్ర్టాల బోర్డుల్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించడం లేదని, సెకండియర్ పరీక్షల్ని మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు.
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కళాశాలలు ఫస్టియర్ పరీక్షలను ఇంటర్నల్‌గా నిర్వహిస్తాయని, 2025-26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. కొత్త ముసాయిదా ప్రకారం ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్, ప్రాక్టికల్స్ తప్పనిసరని తెలిపారు. ప్రజలు తమ సూచనలను జనవరి 26లోగా biereforms@gmail. com మెయిల్‌కు పంపాలని సూచించారు. సంస్కరణల విధానాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.