Margani Bharat | రెడ్‌బుక్ తరహాలో వైసీపీ తీసుకొస్తున్న యాప్ గురించి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేసే అక్రమాలు రాయడానికి బుక్‌లు సరిపోవడం లేదని.. అందుకే డిజిటల్ లైబ్రరీని క్రియేట్ చేశామని చెప్పారు. ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో వాళ్లు యాప్‌లో ఫిర్యాదు చేస్తే.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మంగళవారం నాడు వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో మార్గాని భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ రెడ్‌బుక్ పెట్టిన తర్వాత ప్రజలు, వైసీపీ మద్దతుదారులను చిత్రవధలు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్న ఘటలను నమోదు చేయడానికి ఒక యాప్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు. ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్లు తమ పేర్లు, వివరాలతో పాటు ఆ ఘటనకు సంబంధించిన పత్రాలు, వీడియోలు వంటి ఆధారాలను కూడా సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలో స్టోర్ అవుతుందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి.. వేధింపులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. ఈ డిజిటల్ లైబ్రరీ విషయంలో ఎలాంటి కక్ష సాధింపులు లేవని మార్గాని భరత్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో డైరెక్ట్‌గా వాళ్లే పేర్లు రాసుకుని, వైసీపీ నాయకులను, మద్దతుదారులను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కానీ ఈ యాప్‌లో ఫిర్యాదు చేసిన వారు ఇచ్చిన ఆధారాలను బట్టి విచారణ చేస్తామని పేర్కొన్నారు.
ఇక జగన్ పర్యటనలకు అడ్డంకులు సృష్టించడంపైనా మార్గాని భరత్ మండిపడ్డారు. జగన్ ప్రజాదరణ ఉన్న నాయకుడు అని.. ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారని తెలిపారు. అలా జనాలు రావడంతో కూటమి నాయకుల కడుపు మండుతుందని పేర్కొన్నారు. అందుకే అడుగడుగునా జగన్ పర్యటనలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేశ్ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మేం అడ్డంకులు సృష్టిస్తే లోకేశ్ పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను ఎప్పుడైనా అడ్డుకున్నామా అని అడిగారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు ఎందుకు ఆంక్షలు పెట్టడమని నిలదీశారు.
రోడ్డుపై చంద్రబాబు వెళ్తే జనాలు రావడం లేదని.. అందుకే జగన్‌పై కక్ష గట్టారని మార్గాని భరత్ అన్నారు. చూస్తుంటే జగన్‌పై మీరే దాడులు చేస్తారని అనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మీరు రాజులు కాదని.. ఇది రాచరికం కాదని తెలిపారు. వైసీపీ నేతలపై దాడులు చేసిన ఎవ్వరినీ వదిలిపెట్టమని స్పష్టంచేశారు.