RK Roja | ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి వంగలపూడి అనితకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో ఆడబిడ్డలపై దారుణాలు జరగడం సిగ్గుచేటు అని అన్నారు. మహిళలను కాపాడలేని పరిస్థితిలో ఉన్న అనిత.. హోంమంత్రి పదవి ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా.. జగన్, భారతిలను విమర్శించేందుకే ఆ పదవిని తీసుకున్నారా అంటూ నిలదీశారు. నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా అంటూ చేతగాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా చేయాలని అనితను డిమాండ్ చేశారు.
నగరి నియోజకవర్గంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగినా.. అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని కనిపించకపోయినా పట్టించుకోలేదని రోజా విమర్శించారు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ నేతలు అత్యాచారానికి పాల్పడ్డారని.. ఈ అమానవీయ ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్న ప్రభుత్వం చొరవ చూపడం లేదని.. బాధితులకు న్యాయం జరగడం లేదని అన్నారు. రాష్ట్రంలో జరగుతున్న అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ స్పందించకపోవడాన్ని రోజా తప్పబట్టారు. మహిళలపై హింస పెరిగినా పవన్ కల్యాణ్ స్పందిచడం లేదని.. చంద్రబాబు, లోకేశ్, పవన్ ముగ్గురూ మహిళలపై స్పందించకుండానే నిద్రపోతున్నారని విమర్శించారు.
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దారుణమని రోజా అన్నారు. జగన్, భారతి క్షమాపణలు చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే ఆడబిడ్డ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి.. లేదంటే కడుపు చేయాలని మాట్లాడిన బాలకృష్ణపై కేసులు పెట్టాలని తెలిపారు. జగన్ లండన్‌కు వెళ్తే తప్పుడు వ్యాఖ్యలు చేసిన నారా లోకేశ్‌పై కేసు పెట్టాలన్నారు. జగన్‌ను రేణుకా చౌదరి దారుణంగా దూషించారని.. వారిపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. తనను బండారు సత్యనారాయణ బూతులు తిట్టారని.. ఆయనపై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు.