Pawan Kalyan | గేమ్‌ఛేంజర్ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తుండగా ఇద్దరు అభిమానులు మరణించిన ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటున్నది. ఇద్దరు అభిమానుల మృతిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్లపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా సెల్వమణి మండిపడ్డారు. మానవత్వం మరిచి నిందలు వేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ చనిపోయి మూడు రోజులైనా వారి కుటుంబాలను పరామర్శించకపోగా చౌకబారు రాజకీయం చేయడం తగునా అని ప్రశ్నించారు.
గేమ్ ఛేంజర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరమని రోజా సెల్వమణి అన్నారు. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి మూడు రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయమని అన్నారు. తెలంగాణలో అల్లు అర్జున్, పుష్ప టీమ్ మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు తన అభిమానులు మరణించి మూడు రోజులైనా వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
బాధితుల కుటుంబాలను పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయకపోవడమే కారణమని చౌకబారు రాజకీయం చేయడం తగునా అని పవన్ కల్యాణ్‌ను రోజా నిలదీశారు. ఏడు నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వ మే కదా అని ప్రశ్నించారు. 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరే కాదా పవన్ కళ్యాణ్ అని అడిగారు. అంటే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా అని ప్రశ్నించారు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పుష్పకేమో నీతులు చెప్తారా? గేమ్‌ఛేంజర్‌కి పాటించరా అంటూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ప్రశ్నించారు.
మానవత్వం మరిచి…నిందలా..?
గేమ్ ఛేంజర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరం. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా డిప్యూటీ సీఎం @PawanKalyan కనీసం పరామర్శించకపోవడం అమానవీయం. తెలంగాణలో @alluarjun , పుష్ప టీమ్… https://t.co/4n4gQX5gew pic.twitter.com/hkeKCR8io8
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 6, 2025
అసలేం జరిగిందంటే..
రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్(22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంతో మరణించారు. దీంతో చిత్ర బృందం తరఫున చెరో 5 లక్షల పరిహారం ప్రకటించింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున చెరో 5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.