కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా సెల్వమణి విమర్శించారు. తిరుపతి జిల్లా వడమాల పేటలో హత్యాచారానికి గురైన మూడేళ్ల బాలిక తల్లిదండ్రులను రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. ప్రభుత్వ చేతగానితనం వల్లే నేరస్తులకు వస్తున్న ధైర్యం కాదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నాలుగు నెలల్లో దాదాపుగా 100 మందిపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని రోజా విమర్శించారు. ఇలాంటివి ఏపీలో తప్ప ఎక్కడైనా జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. వీటికి ఏపీ సీఎం చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిగ్గపడాలని మండిపడ్డారు. ఆడవాళ్లకు ఏ చిన్న కష్టమొచ్చినా కూడా బాధపెట్టిన వాళ్లను తొక్కి పట్టి నార తీస్తానని ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ అన్నారని రోజా గుర్తుచేశారు. ఇప్పటికీ 100 మంది ఆడబిడ్డలు చనిపోయారని.. ఎంతమంది నార తీశారని నిలదీశారు. హోం మంత్రిగా ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారని వంగలపూడి అనితను ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉండి నేరస్తులకు ఎందుకు భయం కల్పించలేకపోతున్నారని నిలదీశారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు.
కోడలు కొడుకును కంటే అత్త సంతోషించదా అంటూ ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని రోజా విమర్శించారు. చంద్రబాబు జిల్లాలో మహిళలపై అఘాయిత్యాలు జరగడం ఇది రెండో ఘటన అని చెప్పారు. పుంగనూరులో ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కులోకుండాపోయిందని అన్నారు. ఇవాళ వడమాలపేటలో రెండో ఘటన జరిగిందని అన్నారు. మద్యం మత్తులో ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. విచ్చలవిడిగా మద్యం లైసెన్సులు ఇచ్చి, బెల్టు షాపులు పెట్టడం వల్ల మద్యం మత్తులో ఇలా ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్యం షాపులను తగ్గించాలని.. బెల్టు షాపులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. వీటిపై ఒక నియంత్రణ ఉండాలని సూచించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు.
ఆడబిడ్డలకి చిన్న కష్టం వచ్చినా తొక్కి నార తీస్తానన్నావ్ కదా @PawanKalyan ?
కామాంధులకి చిక్కి రాష్ట్రంలో దాదాపు 100 మంది ఆడబిడ్డలు చనిపోయారు. మరి నిందితుల్లో ఎంత మందిని తొక్కి నార తీశావ్ పవన్ కళ్యాణ్?
-ఆర్కే రోజా గారు, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి#APisNotinSafeHands… pic.twitter.com/it2x3AyROL
— YSR Congress Party (@YSRCParty) November 2, 2024