Roja | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. పవన్ స్వామి.. మీరు పంచె ఎగ్గట్టాల్సింది గుడిమెట్లపై కాదు.. విజయవాడ వరద బాధితుల కోసం అని తెలిపారు. ధర్మం ధర్మం అని అరవాల్సింది నడి రోడ్డుపై కాదు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్‌పై ఘాటుగా స్పందించారు. అలాగే ఏ పనిచేస్తే బాగుంటుందో సలహాలు కూడా ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ అనబడే ఉప ముఖ్యమంత్రి గారూ.. మీరు గొడవపడాల్సింది.. మతాల కోసం కాదు.. నీట మునిగి సాయమందని పేదల కోసం! మీరు కడగాల్సింది మెట్లను కాదు..ఇసుక లేకుండా చేస్తున్న మీ నాయకుల అవినీతిని..! మీరు దీక్ష చేయాల్సింది.. ప్రసాదాల కోసం కాదు.. రాష్ట్రం లో రాలి పోతున్న ఎంతో మంది చిన్న పిల్లల మాన ప్రాణాల కోసం! మీరు ఉపవాసం ఉండాల్సింది.. దేవుళ్ల కోసమే కాదు.. ఎక్కడ చూసినా.. ఆహారం కలుషితమై.. ఆసుపత్రి పాలౌతున్న.. విద్యార్థుల కోసం! అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
మీరు బొట్లు పెట్టాల్సింది.. గుడి మెట్లకు కాదు.. నాడు నేడు పథకాన్ని కొనసాగించి బాగుపరిచిన బడి మెట్లకు! మీరు డిక్లరేషన్ ప్రకటించాల్సింది.. ఇప్పుడు ఏ లోటు లేని సనాతనం కోసం కాదు.. మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన జనాల కోసం! మీరు ఆపసోపాలు పడాల్సింది.. కొండెక్కడం కోసం కాదు..
రాష్ట్రం లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు అరికట్టడం కోసం! మీరు సంప్రోక్షణ చేయాల్సింది కల్తీ జరిగిందో లేదో తెలియని .. లడ్డూ కోసం కాదు
ప్రజలకు ఇసుకే దొరకకుండా చేసిన.. కూటమి నాయకయుల అవినీతి ప్రక్షాళన కోసం! అని రోజా వ్యాఖ్యానించారు.
మీరు దృష్టి పెట్టాల్సింది పక్క రాష్ట్రాల నాయకుల మాటపై కాదు… మీ నియోజకవర్గంలో వికృత చేష్టలకు పాల్పడుతున్న మీ నాయకులపైన అని పవన్ కల్యాణ్‌కు రోజా సూచించారు. దేవుడు తమరికి పుట్టుకతో బుద్ది జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉపయోగించండి పవన్ స్వామి అని అన్నారు.