AP News | అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగు నాగార్జున సూచించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో, విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డ ఘటనపై మేరుగు నాగార్జున స్పందించారు.
నంబూరు శంకర్రావుపై దాడి చేయడం హేయమైన చర్య అని టీడీపీపై మేరుగు నాగార్జున మండిపడ్డారు. పల్నాడులో జరుగుతున్న దాడులపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడులో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.
అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని మేరుగు నాగార్జున సూచించారు. మా పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, విధ్వంసాలు చేసి భయపెడదామని అనుకుంటే కుదరదని అన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం చాలా దారుణమని మండిపడ్డారు. మా కార్యకర్తలను కొడుతున్నారని జిల్లా ఎస్పీకి నంబూరి శంకర్రావు ఫోన్ చేస్తే.. ఎందుకంత మంది కార్యకర్తలు వచ్చారని అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అదే టీడీపీ కార్యకర్తలు వందలాది మంది కర్రలు, రాళ్లు తీసుకుని రోడ్లపైకి వస్తే వాళ్లను ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. వైసీపీ శ్రేణులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.