AP News | సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటు అని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం సోమిరెడ్డి రూ.3 లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించారని తెలిపారు. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించడం లేదని అన్నారు. పైగా పెంచలయ్యతో తాము ఆరోపణలు చేయించామని అంటున్నారని మండిపడ్డారు. తనకు, పెంచలయ్యకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వమే ఉందని.. తమ ఫోన్లపై వాళ్లు నిఘా పెట్టారని మాజీ మంత్రి కాకాణి తెలిపారు. తాను పెంచలయ్యతో మాట్లాడానేమో చూసుకోండని సూచించారు. తాను నిజాయితీపరుడిని అని సోమిరెడ్డి నిరూపించుకోవాలని అన్నారు. పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పీఎస్లో కేసు నమోదు చేశారని.. అతని వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు తనను A2గా చేర్చారని అసహనం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి అవినీతికి పాల్పడినా మాట్లాడకూడదా? ఆయనపై ఇతరులు చేసిన ఆరోపణల వీడియోలు ఫార్వర్డ్ చేయడం కూడా తప్పేనా అని మండిపడ్డారు. పోలీసుల కేసులకు భయపడమని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బెదిరించడం, అధికారంలో లేనప్పుడు బ్లాక్మెయిల్ చేయడం సోమిరెడ్డి నైజమని విమర్శించారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు, అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారని.. ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు.