AP News | వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి విజయసాయి రెడ్డికి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని విమర్శించారు.
నెల్లూరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి ఫోన్ చేసి రూ.5కోట్ల డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వలేదనే అరబిందో మీద ప్రెస్మీట్లు పెట్టి తిడుతున్నారని ఆరోపించారు. తేదీ, సమయం చెబితే విజయసాయి రెడ్డి, తాను వస్తామని.. అరబిందో కంపెనీ నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేసే దమ్ము ఉందా అని సవాలు విసిరారు.
నెల్లూరులో ఎవరూ పట్టించుకోవడం లేదని అసెంబ్లీకి వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి అని కాకాణి విమర్శించారు. ఒకవేళ హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఢిల్లీకి వెళ్లి మరీ ప్రెస్‌మీట్ పెట్టేవాడేమో అని ఎద్దేవా చేశారు. పొదలకూరులోని లేఅవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావని సోమిరెడ్డిని నిలదీశారు. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టడంతోనే విచారణ ఆగిపోయిందని ఆరోపించారు.
విజయసాయి రెడ్డిని లోపలేయడానికి పింక్ డైమండ్‌పై చేసిన అసత్యం ఒక్కటి చాలని మంగళవారం నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విజయసాయి ఒళ్లు కొవ్వెక్కి ముఖ్యమంత్రిని తిడుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా జగన్ అవినీతిలో విజయసాయి రెడ్డి పోటీ పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలోని అరాచకాలు, భూకబ్జాలు, రేషన్ బియ్యం ఎగుమతులు అన్నింటిలోనూ ఆయన పాత్ర ఉందని ఆరోపించారు. విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపైనే కాకాణి ఘాటుగా స్పందించారు.