అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ(Ex-minister Botsa Satyanarayana) ఆసక్తికర ట్విట్(Tweet) పోస్టు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తొలిసారిగా భేటీ అవుతున్నారు. విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సీఎంలు సమావేశం కావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ సమయంలో మాజీ మంత్రి , వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇద్దరు సీఎంల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేయాలని సూచించారు. పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ వాటాల అంశం ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని సూచించారు.