Ambati Rambabu | తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్‌పై రాజకీయ కక్షతోనే చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. జగన్‌ను రాజకీయంగా అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏది జరిగినా జగన్‌పై బురద జల్లుతున్నారని అన్నారు. జగన్ అంటే చంద్రబాబుకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు.
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వాడారని టీడీపీ అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. కల్తీ నెయ్యి వాడారని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి రిపోర్టు వచ్చి రెండు నెలలైతే ఇన్ని రోజులు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. టెస్టులకు పంపించిన మూడు నెయ్యి కంటైనర్లు ఎవరి హయాంలో వచ్చాయని ప్రశ్నించారు. నెయ్యి ట్యాంకర్లు చంద్రబాబు హయాంలోనే వచ్చాయని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నెయ్యిని రిజెక్ట్ చేశామని గుర్తు చేశారు. మొదట వనస్పతి ఆయిల్ కలిసిందని టీటీడీ ఈవో ప్రకటించారని.. ఇప్పుడేమో సీఎం చంద్రబాబు చెప్పిన అంశాన్ని సమర్థించేందుకు కష్టపడుతున్నారని మండిపడ్డారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు రుజువు చేయలేరని అంబటి రాంబాబు అన్నారు. దీనిపై తిరుమలలో ప్రమాణం చేయడానికి అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తాము చేసిన ఆరోపణలు నిజమేనని ప్రమాణం చేయడానికి చంద్రబాబు, నారా లోకేశ్‌కు ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని వాడుకుంటున్నారని విమర్శించారు.
దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ఆ దేవుడే శిక్ష వేస్తాడని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు దుర్మార్గమైన, నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.