అమరావతి : ముంబై సినీ నటి కాదంబరి జత్వానిపై(Film actress Jatwani) వేధింపుల కేసులో వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ని ఇరికించాలని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ex-minister Ambati) ఆరోపించారు. ఈ కేసులో కూటమి ప్రభుత్వం కుక్క తోక పట్టుకుని గోదావరిని ఈదాలని అనుకుంటున్నారని,కేసుతో గాలిమేడలు కట్టాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
రాబోయే రోజుల్లో వాస్తవాలు ఏంటో ప్రజలు గమనిస్తారని తెలిపారు. సజ్జల లాంటి వ్యక్తి సచ్చీలుడిపై నిందారోపణలు చేయడం కుట్రేనని ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి జగన్(YS Jagan) కు సలహదారుడికి ఉండడం సజ్జల చేసిన నేరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జత్వానిపై అనేక చోట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
కూటమి ప్రభుత్వం బెదిరింపులకు వైసీపీ భయపడబోదని స్పష్టం చేశారు. వైసీపీకి చెందిన ఎంపీలు రాజీనామాపై (YCP MPs resign) ఆయన స్పందించారు. పార్టీ నుంచి ఎందరూ మారిని వైసీపీని ఎవరూ ఏమీ చేయలేరని ధీమాను వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జగన్ ఒక్కరే 40 శాతం ఓట్లు సాధించారని, ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని తెలిపారు. పార్టీలు మారిన నాయకులు కాలగర్భంలో కలిసిపోతారని ఆరోపించారు.