ఏపీ లిక్కర్ స్కాం కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ డిప్యూటీ సీఎం కె.నారాయణ స్వామి స్పందించారు. ఈ కేసులో సిట్ అధికారులు నారాయణ స్వామిని దాదాపు ఆరు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా ఆయన నుంచి కీలక సమాచారం సేకరించారని.. ఆయన ల్యాప్‌టాప్‌ను కూడా సీజ్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఆయన ఖండించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే తాను సమాధానం చెప్పానని.. తనకు కేసుతో సంబంధం లేదని చెప్పానని అన్నారు.
చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి, తన దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకే లేని లిక్కర్ వ్యవహారాన్ని సృష్టించారని కె.నారాయణ స్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం కక్ష సాధింపుల కోసమే లిక్కర్ స్కాం అంటూ ఒక బేతాళ కథను తయారు చేసి, దాని ద్వారా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తానెప్పుడూ నీతిగా, నిజాయితీగా బతికానని తెలిపారు. ఎప్పుడూ తప్పు చేయలేదని.. అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. వృద్ధాప్యం కారణంగా గత ఏడాది ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదని.. నా విజ్ఞప్తి మేరకు నా కుమార్తెకు జగన్ టికెట్ ఇచ్చారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా సిట్ అధికారులు తన దగ్గరకు వచ్చి దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆవేదనకు గురయ్యారు.
నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి తనపై రకరకాల ప్రచారం చేశారని కె.నారాయణ స్వామి మండిపడ్డారు. నన్ను అరెస్టు చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారంటూ తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు ల్యాప్‌టాప్ అంటే ఏంటో.. దానిని ఎలా వాడాలో కూడా తెలియదని నారాయణస్వామి స్పష్టం చేశారు. సిట్ అధికారులు మా ఇంటి నుంచి ఎలాంటి ల్యాప్‌టాప్‌ను తీసుకెళ్లలేదని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018-19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే.. మా వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023-24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు అని నారాయణ స్వామి తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాం కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయని.. కానీ పన్నులు వేయడం వల్ల ఆదాయం పెరిగిందని వివరించారు. 2014-19 మధ్య పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేస్తే.. తమపై తప్పుడు కేసులు పెట్టి, రాజకీయంగా కక్షలు తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పుడు, ప్రైవేటు విక్రయాలకు ఫుల్స్టాప్ పెట్టినప్పుడు చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా స్కామ్ జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే లంచాలు ఇస్తారా? అని నిలదీశారు.