YS Jagan | అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై కనిపిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. ప్రతి నెలా ఒక అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైందని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసి మన చరిత్ర మార్చామని.. బడ్జెట్ సమయంలో సంక్షేమ క్యాలెండర్ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాలు ఇచ్చే పరిస్థితులను తీసుకొచ్చామని చెప్పారు. అవినీతి లేని పాలనను అందించామని.. అయినప్పటికీ ఓటమి పాలయ్యామని చెప్పారు. దీనికి కారణమేంటని జగన్ ప్రశ్నించగా.. ఈవీఎంలే కారణమని సమావేశానికి వచ్చిన ప్రజాప్రతినిధులు సమాధానమిచ్చారు. దీనితో పాటు చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా వైసీపీ ఓటమికి మరో కారణమని జగన్ చెప్పారు. మనం ప్రతి ఇంటికి పులావ్ పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నాడని.. కానీ ఇప్పుడు పులావ్ పోయింది.. బిర్యానీ పోయిందని ఎద్దేవా చేశారు. హామీల విషయంలో జగన్ చేసినట్లుగా చంద్రబాబు కూడా నెరవేరుస్తారని ప్రజలు భావించారని అన్నారు. ఎలాంటి కారణాలు చూపకుండా.. కొవిడ్ లాంటి సంక్షోభ సమయంలో కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. మనకు ఉన్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. అతి మంచితనం, అతి నిజాయితీతనం.. ఈ రెండింటీ వల్ల రాజకీయాల్లో తాను ఇబ్బంది పడుతున్నట్లు చాలామంది తనకుగురించి అంటారని చెప్పారు. బహుశా ఈ రెండే రేపు వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు వచ్చాడు.. బాదుడే బాదుడు మొదలైందని జగన్ ఎద్దేవా చేశారు. కరెంటు ఛార్జీలను రూ.15వేల కోట్లకు పైగా పెంచారని.. గ్రామీణ రోడ్లపై కూడా ట్యాక్స్ వేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు సంపద సృష్టి అంటే.. బాదుడే బాదుడు అని విమర్శించారు. రామాయపట్నం పోర్టు దశాబ్దాల కల అని.. దాన్ని కట్టింది వైసీపీ ప్రభుత్వమే అని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో దాదాపు పూర్తయ్యిందని.. షిప్లు కూడా వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. ఐదేళ్లలో నాలుగు పోర్టులు కట్టడం మొదలైందని.. కానీ ఇప్పుడు వాటిని శనక్కాయలకు, బెల్లాలకు అమ్మేస్తున్నాడని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు, పోర్టుల రూపంలో మనం సంపద సృష్టిస్తే.. పద్ధతి ప్రకారం వాటిని అమ్మే కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదని జగన్ అన్నారు. అందుకే బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం, దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ సోషల్మీడియా అకౌంట్ ఉండాలని.. అన్యాయం జరిగితే దాని ద్వారానే ప్రశ్నించాలని సూచించారు.