EO Peddiraju | ఆలయానికి వచ్చే ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సిబ్బందిని ఈవో పెద్దిరాజు ఆదేశించారు. క్షేత్రంలో శ్రావణమాసం ప్రారంభోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో పర్యటించి.. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల సిబ్బంది పరస్పర సమన్వయం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా భక్తులకు వసతి సౌకర్యం, సులభ దర్శనం, అన్నప్రసాద వితరణతో పాటు క్షేత్ర పరిధిలో పారిశుధ్యం, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ క్రమబద్ధీకరణను ఆయా విభాగాల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. దర్శన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు.
క్యూలైన్లలో భక్తులకు మంచినీరు, బిస్కెట్స్, అల్పహారం అందించాలని చెప్పారు. దర్శనం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు తదితర చోట్ల తొక్కిసలాట జరుగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్న ప్రసాదం కోసం వచ్చే భక్తులు ఎక్కువ సమయం నిరీక్షించకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు అన్నదాన భవనంలోని భోజనశాలలో తగు ముందస్తు ఏర్పాట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. భవనంలో వండిన ప్రతి వంటకం భక్తులందరికీ చేరేలా నిత్యం పర్యవేక్షించాలన్నారు. క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగం పర్యవేక్షకులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసుశాఖ సహాయ సహకారాలను తీసుకోవాలని చెప్పారు.