Srisailam | స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా ఈ నెల 8వ తేదీన పారిశుద్ధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని శ్రీశైల ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికోసం తగు ప్రణాళికను రూపొందించామని చెప్పారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 68 ప్రదేశాలుగా విభజించడం జరిగిందన్నారు.
పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జోన్కు కూడా యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను ప్రత్యేక అధికారులుగా నియమించామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అదేవిధంగా ఆయా జోన్లలో పలువురు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ మాడవీధులు, గంగాధర మండపం నుంచి తూర్పువైపున నందిగుడి వరకు గల ప్రదేశం దక్షిణం వైపున అలంకారేశ్వరాలయం గల ప్రదేశం, దర్శన క్యూకాంప్లెక్సు విరాళాల సేకరణ కేంద్ర ప్రాంగణం మరియు పరిసరాలు, అన్నప్రసాద వితరణ భవన పరిసరాలు, శ్రీలలితాంబికా వాణిజ్య సముదాయం, సీఆర్వో కార్యాలయ పరిసరాలు, దేవస్థానం వైద్యశాల పరిసరాలు, గంగాగౌరి సదన్ పరిసరాలు, మల్లికార్జున సదన్ పరిసరాలు, చల్లా వెంకయ్య సత్రం పరిసరాలు, గణేశసదన్ పరిసరాలు, టూరిస్ట్ బస్టాండ్ పరిసరాలు, సెంట్రల్ పార్కింగ్ ప్రదేశం, మల్లమ్మ కన్నీరు పరిసరాలు, పంచమఠాల పరిసరాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిసరాలు, సర్వతోభద్రవన పరిసరాలు, కల్యాణకట్ట పరిసరాలు, పాతాళగంగ పాతమెట్ల మార్గం, ఆర్టీసి బస్టాండు, సిద్ధిరామప్ప వాణిజ్య సముదాయం, పాతాళగంగ మెట్ల మార్గం, పాతాళగంగ స్నానఘట్టాలు, భ్రమరాంబ అతిథి గృహ పరిసరాలు, శ్రీగిరి కాలనీ, కొత్తపేట అడ్డరోడ్లు, సాక్షి గణపతి ఆలయ పరిసరాలు, హాటకేశ్వరాలయ పరిసరాలు, ఫాలధార – పంచధార, శిఖరేశ్వర ఆలయ పరిసరాలు మొదలైన చోట్ల పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందితో పాటు దుకాణాల నిర్వాహకులు, సత్రాల సిబ్బంది స్థానికులందరు కూడా పాల్గొని క్షేత్ర పవిత్రతను కాపాడటంలో సహకరించాలని కోరారు.