Yogandhra | శ్రీశైలం : యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఎదుట గంగాధర మండపం వద్ద ప్రత్యేక యోగ కార్యక్రమం నిర్వహించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవం నిర్వహించనున్నారు. గంగాధర మండపం వద్ద ఉదయం 7 గంటలకు కార్యక్రమాలు జరుగుతాయి. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక యోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 31న శ్రీశైలంలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి 24వ తేదీ నుంచి దేవస్థానం యోగా శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నది. ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి గంగాధర మండప ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ నెల 31-జూన్ 21న తేదీన తలపెట్టిన యోగా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి సంబంధిత విభాగాలకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ దైనందిత జీవితంలో ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి యోగా ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన యోగా కార్యక్రమాలను దేవస్థానంలో చేపట్టడం జరుగుతోందన్నారు. యోగా నిర్వహణ కార్యక్రమం కోసం గంగాధరమండపం వద్ద విశాలమైన వేదికను ఏర్పాటు చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మురళీబాలకృష్ణను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా యోగా నిర్వహించే ప్రదేశంలో బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. యోగా ప్రచారంలో భాగంగా ఎయిర్ బెలూన్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. యోగా నిర్వహణకు గాను పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ మురళీబాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరెడ్డి, ఇన్చార్జి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీ చంద్రశేఖరశాస్త్రి, చంద్రశేఖరశాస్త్రి, పీవీ సుబ్బారెడ్డి, భద్రతా విభాగం పర్యవేక్షకులు మల్లికార్జున, ఉద్యానవనాధికారి లోకేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.