AP News | దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతిపై సస్పెన్షన్ వేటుపడింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారం మేరకు శాంతిపై ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేశారు. అనంతరం 7వ తేదీ ఉదయం శాంతికి సంబంధించిన ఆస్తులపై మూడు చోట్ల తనిఖీలు చేశారు. వీటిలో రూ.1.37 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను అదే రోజు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి కస్టడీలో ఉంటే వాళ్లను సస్పెండ్ చేయాలి. ఈ నేపథ్యంలోనే సహాయ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 7 నుంచే అమలులోకి వచ్చాయని తెలిపారు.