అమరావతి : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో (Elections) భాగంగా 2027లోనే ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో వైసీపీ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని, అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు. గత ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామన్న ఆందోళన అవసరం లేదని అన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నాయకులు కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.
మాజీ మంత్రి అమర్నాథ్ (Amarnath) మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులను ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఆరు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం 72 వేల కోట్లు అప్పు తెచ్చి సంక్షేమానికి 200 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, అరకు ఎంపీ తనూజ రాణి, వరుదు కల్యాణి, బుడి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.