హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు (General Election) జరగాల్సి ఉంది . అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు సీట్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ముందస్తు ఎన్నికలు జరగొచ్చన్న ప్రచారం, జమిలి ఎన్నికలకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందన్న అంచనాల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ ఈసీ (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా గెజిట్ నోటిఫికేషన్ ( Notification) జారీ చేసింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులను నియమించింది.
ఏపీలో వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ లోపే జమిలి లేదా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో అన్ని సీట్లలోనూ రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా అధికారికంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లు భావించవచ్చు.
ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితాల (Voters List ) సవరణ చేపట్టిన ఈసీ ఓటర్ల జాబితాలో తప్పుల సవరణతో పాటు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఈసీ ప్రారంభించడం ముందస్తు ఎన్నికల ఊహగానాలను ఊతం ఇస్తుంది . వాస్తవానికి ఈ కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ వరకూ కొనసాగబోతోంది. అయితే ఆ లోపు రిటర్నింగ్ అధికారుల్ని కూడా నియమించడం ద్వారా ఎన్నికలకు తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు ఈసీ సంకేతాలు ఇస్తోంది. ఏపీలో ముందస్తూ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతుండగా అలాంటి ఆలోచన లేదని ప్రభుత్వం పేర్కొంటోంది. విపక్షాలు మాత్రం ఈ వాదనను నమ్మడం లేదు.