అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడగా, పలువురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పడమర వీరాయపాలెంలో పొలం పనులకు వెళ్లిన రాములమ్మ అనే మహిళ పాముకాటుకు గురై మృతి చెందింది. మరోవైపు వైఎస్సార్ జిల్లాలో ఎర్రచందనం దుంగలు తరలించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. భాకరాపేట, చింతరాజుపల్లెకు చెందిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల నుంచి తిరుపతికి వచ్చే రహదారిలో ప్రమాదం జరిగింది. మొదటి కనుమ రహదారి 58వ మలుపు వద్ద బ్రేకులు ఫెయిలై జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. బాపట్ల జిల్లాలో సోమవారం ఉదయం వేటపాలెం మండలం పందిళ్ళపల్లి బైపాస్‌లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కొత్తపేట వాసులు ధర్మరాజు(20), కనకారావు(41) గా గుర్తించారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన తొండపి నరసింహారావు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పీవీపురం వద్ద చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతిచెందారు. యర్రావారిపాలెం మండలం తెట్టుపల్లెలో పిడుగుపాటుకు సిద్ధమ్మ అనే 70 ఏండ్ల వృద్ధురాలుతోపాటు ఒక గోవు మరణించింది.