అమరావతి : విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీ 24 ,25వ స్నాతకోత్సవం ఇవాళ జరిగింది. వర్శిటీ ఛాన్సలర్ , ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ వర్చువల్ విధానం ద్వారా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉన్నత విద్య పరిధి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని అన్నారు.
విద్య దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, దేశానికి వెన్నెముకగా నిలుస్తుందని వెల్లడించారు. పౌరులు చైతన్యవంతంగా, వనరులతో, ఔత్సాహికంగా, బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని గవర్నర్ అన్నారు. ఉన్నత విద్య అతి ముఖ్యమైన లక్ష్యం ప్రపంచ స్థాయి విద్యను అందించడం, మేధో సంపత్తిని సృష్టించడమని పేర్కొన్నారు.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి ఏ దేశమైనా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పురోగతిని తీసుకురావడానికి ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుందని ఆయన అన్నారు. ఎంచుకున్న కెరీర్లో విజయం సాధించడానికి అవసరమైన నిబద్ధత, సృజనాత్మకత, ప్రతిభ కోసం గ్రాడ్యుయేషన్ విద్యార్థులు, గోల్డ్ మెడల్స్ పొందిన వారి తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ సభ్యులు, పరిపాలనా సిబ్బందిని గవర్నర్ అభినందించారు.