అమరావతి : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎబోలా వైరస్ ( Ebola Virus ) వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న అప్రమత్త చర్యలో భాగంగా విజయవాడ ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ పరీక్షా (Screening Tests ) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించినట్లు విమానాయాన అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. కేసులు పెరుగుతున్న కారణంగా ఏపీ ప్రభుత్వం ( Andhra Pradesh ) సూడాన్, కాంగో, ఉగాండాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే వారికి వైద్య పరీక్షలు జరుపాలని నిర్ణయించింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల ( Airports ) పై ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించింది.
ఓడరేవులతో పాటు రోడ్డు మార్గాలపై కూడా ప్రత్యేక దృష్టిని సారించారు. ఎబోలాకు గురైన వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, విపరీతమైన వాంతులు, విరేచనాలు, ముక్కు, నోరు, అంతర్గత అవయవాల నుంచి తీవ్రమైన రక్తస్రావం జరుగుతుందని అధికారులు వివరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మధ్య ఆఫ్రికాలోని ఉగాండా,కాంగో దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. నమోదైన కేసుల్లో దాదాపు 50 శాతం మరణాలు సంభవిస్తుండడంతో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.