Srisailam | శ్రీశైలం : సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు జరుగుతాయని దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉత్సవాల సమయంలో స్వామి అమ్మవార్లకు జరిపించాల్సిన ఆయా కైంకర్యాలు, వాహనసేవలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, నిజరూపాలంకరణ, రాజరాజేశ్వరి అలంకరణ, విజయదశమిరోజున శమీపూజ, తెప్పోత్సవం, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వాహనాల పార్కింగ్, క్యూలైన్ల క్రమబద్ధీకరణ, దర్శనం ఏర్పాట్లు, భక్తులకు అన్నప్రసాదవితరణ, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాలు సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని.. ఆయా విభాగాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
EO Srinivasa Rao
ఉత్సవాల్లో స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరిపించాలని, సమయ పాలన పాటించాలని వైదిక సిబ్బందికి సూచించారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు. భక్తులు ఉత్సవ విశేషాలను వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అలాగే, వేడుకల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో పాటు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పుష్పాలంకరణ చేయాలని సూచించారు. రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, వాహనాల పార్కింగ్ విషయంలో ముందస్తు ఏర్పాటు చేయాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయంలో పోలీస్‌శాఖ సహకారం తీసుకోవాలని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్న ఆయన.. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులరద్దీకనుగుణంగా అన్నప్రసాదాల వితరణకు (అన్నదానానికి), రాత్రివేళలో అల్పాహారానికి తగు ఏర్పాట్లు చేయాలన్నారు.
EO Srinivasa Rao
క్యూకాంప్లెక్స్‌లో భక్తులకు మంచినీరు, అల్పాహారం అందిస్తూ ఉండాలని చెప్పారు. ఆయా ఉత్సవాల విశేషాలు భక్తులకు తెలిసేలా ఆయా ప్రదేశాలలో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్, శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు. ప్రసార మాధ్యమాల్లో ప్రచారాన్ని సైతం కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాలలో కూడా ఉత్సవాల సంబంధి విశేషాలను భక్తులకు తెలియజేస్తుండాలని ప్రచారవిభాగాన్ని ఆదేశించారు. ఉత్సవాల సమయంలో నిత్యకళావేదికపై ప్రవచనాలు, హరికథ, వాయిద్యసంగీతం, సంప్రదాయ నృత్యం, మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల అధికారిని ఆదేశించారు. గ్రామోత్సవంలో నాదస్వరంతోపాటు కోలాటం, చెక్కభజన, నందికోలుసేవ, డోలువాయిద్యాలు మొదలైన జానపద కళారూపాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఆలయ అర్చకులు, వేదపండిఉలు, డిప్యూటీ ఈవో, ఏఈలు, ఆయాశాఖల ఇన్చార్జీలు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.