అమరావతి : వైఎస్ జగన్ (YS Jagan ) ప్రభుత్వ హయాంలో పోలవరం ( Polavaram ) నిర్వాసితులకు మొండి చేయి చూపారని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు (Minister Nimmala) ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని పాదయాత్రలో చెప్పి, అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు.
పశ్చిమ గోదావరి ( West Godavari ) జిల్లా పాలకొల్లు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి, శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం తాజాగా పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు రూ. 815 కోట్ల పరిహారం అకౌంట్లలో జమ చేశామన్నారు. వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసానికి గురైందని ఆరోపించారు.
చంద్రబాబు పోలవరాన్ని పునర్నిర్మిస్తున్నారని తెలిపారు. జాతీయ ప్రాజెక్టయిన పోలవరానికి కేంద్రం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తుందని , నిర్దేశిత సమయంలో పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.