(TTD foreign donations:) హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టీటీడీకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) లైసెన్స్ రెన్యువల్ కాలేదు. దీంతో టీటీడీకి విదేశీ విరాళాల సేకరణకు బ్రేక్ పడింది. సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ తన రెన్యువల్ దరఖాస్తును అందించలేదు. దాంతో విదేశీ భక్తుల నుంచి వచ్చే విరాళాలు నిలిచిపోయాయి.
స్వచ్ఛంద, మతపరమైన సంస్థలకు విదేశీ విరాళాల వసూళ్లకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీచేసే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ తప్పనసరి. ఒక్కసారి ధరఖాస్తు చేసుకుంటే లైసెన్స్ ఐదేండ్ల పాటు కొనసాగనున్నది. టీటీడీ లైసెన్స్ గడువు 2020 డిసెంబర్‌తో ముగిసింది. లైసెన్స్ రెన్యువల్ కోసం ఏడాదిగా టీటీడీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సవరించిన నిబంధనలకు అనుగుణంగా టీటీడీ రెన్యువల్ దరఖాస్తు చేసుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి 18,778 సంస్థలకు లైసెన్స్ గడువు ముగిసింది. 12,989 సంస్థలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 5,789 సంస్థలు దరఖాస్తు చేయలేదని కేంద్ర హోమంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. 2020-21 ఏడాదిలో టీటీడీకి విదేశీ విరాళాలు ఒక్క రూపాయి కూడా అందలేదు. గతంలో టీటీడీకి పెద్ద సంఖ్యలో విదేశీ భక్తుల నుంచి విరాళాలు వచ్చేవి. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో ప్రస్తుతం టీటీడీకి విదేశీ విరాళాలు నిలిచిపోయాయి.