అమరావతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతి మండలంలో రెండు హైస్కూళ్లు, రెండు కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఈఆర్టీ సిఫార్సులన్నీ అమల్లోకి రావాలన్నారు. రీసోర్స్ సెంటర్ను మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పు చేయాలని చెప్పారు.
ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే డ్రాయింగ్ అధికారాలుండాలని ఎస్ఈఆర్టీ చేసిన సిఫారసుకు సీఎం ఆమోద ముద్ర వేశారు. ఎంఈవో పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని ఆయన పేర్కొన్నారు . సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలని, కొత్త విద్యావిధానాల వల్ల 22వేల మంది టీచర్లకు పదోన్నతి వస్తుందని వెల్లడించారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని ఆదేశించారు. పదోన్నతులు, బదిలీలు సత్వరమే పూర్తి చేయాలన్నారు. జూన్ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ఆదేశించారు.